ఇంఫాల్ ఎయిర్‌పోర్టు వద్ద కన్పించిన గుర్తుతెలియని వస్తువు (UFO) కోసం భారత వాయు సేన రఫేల్ యుద్ధ విమానాల (Rafale fighter jets)ను రంగంలోకి దించింది. ఆ వస్తువు కోసం ఫైటర్ జెట్లు గాలించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
Updated : 20 Nov 2023 13:57 IST
దిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపుర్ (Manipur)లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం (Imphal Airport) సమీపంలో ఆదివారం ఓ గుర్తు తెలియని వస్తువు (UFO) గాల్లో ఎగరడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఆ వస్తువును గుర్తించేందుకు భారత వాయు సేన (IAF)కు చెందిన రెండు అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter jets) తీవ్రంగా గాలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రక్షణశాఖ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.
ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో.. ఎయిర్‌పోర్టు వద్ద ఓ గుర్తుతెలియని ఎగిరే వస్తువు కనిపించింది. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే.. గగనతల నియంత్రణ వ్యవస్థ (ATC)కి సమాచారమిచ్చారు. అప్రమత్తమైన ఏటీసీ.. ముందు జాగ్రత్తగా ఈ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఈ వస్తువు గురించి సమాచారం రాగానే.. ఐఏఎఫ్ రెండు రఫేల్ ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది.
‘‘ఇంఫాల్ ఎయిర్‌పోర్టు వద్ద గుర్తుతెలియని వస్తువు గురించి సమాచారం అందగానే.. సమీపంలోని ఎయిర్‌బేస్ నుంచి ఓ రఫేల్ యుద్ధ విమానాన్ని ఐఏఎఫ్ పంపించింది. అడ్వాన్స్డ్ సెన్సర్లు కలిగిన ఈ అధునాతన ఫైటర్ జెట్.. అనుమానిత ప్రాంతంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ ఆ వస్తువు కోసం గాలించింది. అయితే ఎక్కడా అలాంటి వస్తువు కన్పించకపోవడంతో ఆ యుద్ధ విమానం తిరిగొచ్చింది. ఆ తర్వాత కాసేపటికి మరో రఫేల్ ఫైటర్ జెట్ గాలించినా.. ఎలాంటి యూఎఫ్‌వో కన్పించలేదు’’ అని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
మూడేళ్లుగా ఏం చేస్తున్నారు..? తమిళనాడు గవర్నర్‌కు సుప్రీం ప్రశ్న
ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ఇంఫాల్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజమ్‌ను యాక్టివేట్ చేసినట్లు భారత వాయుసేన ఈస్ట్రన్ కమాండ్ వెల్లడించింది. ఆ తర్వాతి నుంచి ఆ వస్తువు కనిపించకుండా పోయిందని తెలిపింది. ఈ ఘటన కారణంగా దాదాపు మూడు గంటల పాటు ఈ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను దారిమళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి.
పశ్చిమ బెంగాల్‌లోని హషిమారా ఎయిర్‌బేస్ వద్ద ఐఏఎఫ్ ఈ రఫేల్ ఫైటర్ జెట్లను మోహరించింది. ఇవి తరచూ తూర్పు సెక్టార్‌లోని చైనా సరిహద్దు వెంబడి గస్తీ కాస్తుంటాయి. ఇటీవల చైనా సరిహద్దుల్లో భారత ఆర్మీ చేపట్టిన ‘పూర్వీ ఆకాశ్’ మెగా వాయుసేన విన్యాసాల్లోనూ రఫేల్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Más historias